మట్టి గణపతులపై అవగాహన కల్పిస్తున్న లీడర్లు

మట్టి గణపతులపై అవగాహన కల్పిస్తున్న లీడర్లు
  • తొలి రోజు నుంచి నిమజ్జనం వరకు పోలీసు బందోబస్తు
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదలైన ఉత్సవ సందడి
  • మట్టి గణపతులపై అవగాహన కల్పిస్తున్న లీడర్లు, ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థలు

వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి జిల్లాలో గణేశ్​ ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ గణనాథులు కొలువుదీరనుండగా..అంతటా పండుగ వాతావరణం నెలకొంది. యూత్ అంతా విగ్రహాల కొనుగోళ్లలో నిమగ్నం కాగా.. ఆఫీసర్లు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. తొలి రోజు నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. లీడర్లు, ఆఫీసర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయగా.. నేడు కూడా పలుచోట్ల పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి, గణేశ్​ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని మహబూబాబాద్ కలెక్టర్ కె.శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కలిసి ఆయన రివ్యూ చేశారు. నిమజ్జన ప్రదేశాల్లో కరెంట్, శానిటేషన్, తాగునీరు, పార్కింగ్, మెడికల్ క్యాంపులు, గజ ఈతగాళ్లు, ఫైర్ ఇంజన్లు, 108 వెహికల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎస్​హెచ్​వోలు నిమజ్జన ప్రాంతాలను సందర్శించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలకు సంబంధించి జిల్లా పంచాయతీ ఆఫీసర్, ఎంపీడీవోలు నిమజ్జన బాధ్యతలు తీసుకోవాలన్నారు.

జనగామ జిల్లాలో గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శివ లింగయ్య తెలిపారు. మంగళవారం డీసీపీ సీతారాంతో కలిసి ఆయన రివ్యూ నిర్వహించారు. వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అవసరమైన క్రేన్లు, గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.

వినాయక చవితిని ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి కోరారు. మంగళవారం వరంగల్ సీపీ తరుణ్ జోషితో కలిసి రివ్యూ నిర్వహించారు. నిమజ్జన ప్రాంతాల్లో మంచినీళ్లు, క్రేన్లు, లైటింగ్, మెడికల్​క్యాంప్​లు ఏర్పాటు చేయాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీసులు, కరెంట్ ఆఫీసర్ల వద్ద తప్పనిసరిగా పర్మిషన్లు తీసుకోవాలన్నారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెడుతామని సీపీ తరుణ్ జోషి చెప్పారు. ఎలాంటి గొడవలు జరగకుండా, శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలని మండపాల నిర్వాహకులకు కోరారు. పర్యావరణహితం కోసం భక్తులు మట్టి విగ్రహాలనే వాడాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి సూచించారు. వరంగల్ సిటీలోని 29వ డివిజన్​లో ఆమె మట్టి గణపతులను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల ప్రకృతికి విఘాతం కలుగుతుందన్నారు. అలాగే ములుగులో జిల్లా సైన్స్ ఆఫీసర్ అప్పని జయదేవ్, జనగామలో కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారం, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీంద్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.