గోల్డ్‌ కు తగ్గిన గిరాకీ

గోల్డ్‌ కు తగ్గిన గిరాకీ

బంగారం ధరలు ఈ వారం భారీగా దిగొచ్చాయి. గత నెల దాదాపు రూ.35 వేల దాకా వెళ్లిన 10 గ్రాముల బంగారం ధర, ఒక్కసారిగా మళ్లీ కిందకు జారింది. స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్‌ తక్కువగా ఉండటం వల్ల ఈ వారం పసిడి ధర రూ.34 వేల కిందకు వచ్చింది. బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి, చివరికి రూ.33,770గా నమోదైంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా ఈ వారం బాగానే క్షీణించాయి. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో కేజీ వెండి ధర ఏకంగా రూ.1,550 మేర తగ్గింది. దీంతో రూ.40 వేల మార్క్‌ దిగువకు జారి కేజీ వెండి ధర రూ.39,950గా నమోదైంది. శనివారం ఒక్కరోజే బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.310 మేర తగ్గింది. వెండి ధర కూడా కేజీకి రూ.730 పడిపోయింది.

డాలర్‌ బలోపేతంతో బంగారానికి ఇబ్బందులు నాలుగో క్వార్టర్‌‌లో అమెరికా స్థూల ఆర్థిక డేటా అంచనా వేసిన దానికంటే మెరుగ్గా నమోదు కావడంతో డాలర్ పుంజుకుంటోంది. జపాన్‌ కరెన్సీ యెన్‌తో పోలిస్తే డాలర్ విలువ 10 వారాల గరిష్టానికి ఎగిసింది. సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారానికి డిమాండ్ పడిపోయింది. నాలుగో క్వార్టర్‌‌లో అమెరికా జీడీపీ 2.6 శాతానికి పెరిగింది. 2015 తర్వాత ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. 2017లో ఇది 2.2 శాతంగా ఉండేది. మరోవైపు ఫెడరల్ రిజర్వు ఎప్పటికప్పుడు రేట్ల పెంపు గురించి ప్రకటనలు చేస్తూనే ఉంది. స్థూల ఆర్థిక డేటాకు అనుగుణంగా రేట్ల పెంపు ఉంటుందని చెబుతోంది. ఇవన్నీ డాలర్ బలోపేతానికి సహకరిస్తున్నాయి.

గ్లోబల్ గా స్పాట్‌ గోల్డ్ ధర ఈ వారం ఔన్స్ కు 1,293.90 (దాదాపు రూ.91,870) డాలర్లకు పడిపోయింది. జనవరి 28 తర్వాత ఇదే అత్యంత కనిష్టం. వెండి కూడా అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ కు 15.29 (దాదాపు రూ.1,085) డాలర్లుగా నమోదైంది. దేశీయ మార్కెట్ లో స్థానిక ఆభరణదారులు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో ఈ విలువైన లోహపు ధరలు ఒత్తిడికి గురైనట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. ఈ వారం రూ.34,590తో ప్రారంభమైన 99.9శాతం స్వచ్ఛత కలిగిన బంగారం, వారం చివరి నాటికి రూ.820 మేర పడిపోయింది. చివరికి రూ.33,770 వద్ద స్థిరపడింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం కూడా రూ.840 తగ్గి రూ.32,600 కు చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 31,480గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే రూ.33,700గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గి కిలో రూ.43,300గా రికార్డైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రూ.31,480గా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,700గా నమోదైనట్టు బంగారం వర్తకులు చెప్పారు. కిలో వెండి ధర రూ.43,300గా ఉన్నట్టు పేర్కొన్నారు. బెంగళూరులో 22క్యారెట్ల బంగారం రూ. 31,170గా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,336గా, కిలో వెండి ధర రూ.43,300గా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ. 31,480గా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,700గా, కిలో వెండి ధర రూ.43,300గా రికార్డయ్యాయి.