రాష్ట్రంలో నిండుకుండలా జలాశయాలు

రాష్ట్రంలో నిండుకుండలా జలాశయాలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. కృష్ణాబేసిన్ లో కురుస్తున్న వర్షాలకు జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2.10లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2.17లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి..3లక్షల 48వేల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా విడుదల చేస్తున్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టు

ఇక శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 15 అడుగులు ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3లక్షల 52వేల 105 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4లక్షల 40వేల 810 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగుల వరకు నీరు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 214.3637 అడుగుల వరకు నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని శ్రీరాంసాగర్, కడెం, లోయర్ మానేర్ డ్యామ్ లకు వరద కొనసాగుతోంది. దీంతో మంజీరా, కడెం, లోయర్ మానేర్ డ్యామ్ లు నిండు కుండలను తలపిస్తున్నాయి.

లోయర్ మానేరు డ్యాం

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం కు భారీగా వరద చేరుతోంది. దీంతో డ్యాం 4 గేట్లు ఎత్తి 7800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మరో 3 వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి డ్యామ్ లోకి దాదాపు 8500 క్యూసెక్కుల ఇన్  ఫ్లో వస్తోంది. మరో రెండు గేట్లు ఎత్తి అధికారులు నీటిని వదులుతున్నారు. మొత్తం ఆరు గేట్లతో పాటు, కాకతీయ కాలువ ద్వారా 15 వేల 129 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. మోయతుమ్మెద వాగు, మిడ్ మానేరు నుంచి 13 వేల 667 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.