సర్కారు దవాఖాన్లలో మెషీన్లు పన్జేస్తలేవు

సర్కారు దవాఖాన్లలో మెషీన్లు పన్జేస్తలేవు

హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో డయాగ్నసిస్  మెషీన్లు మాటిమాటికి మూలకు పడుతున్నాయి. కొన్ని చోట్లయితే ఐదారు నెలలుగా రిపేర్లకు నోచుకోవడం లేదు. మరికొన్ని చోట్ల మెషీన్లు పాతవి కావడంతో మస్తు సతాయిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల మెషీన్లు ఉన్నా వాటిని ఆపరేట్​ చేసే దిక్కు లేదు. రిపేర్లు చేయించడంలో ఆఫీసర్లు జాప్యం చేస్తుండటం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పేషెంట్లు ప్రైవేటు ల్యాబ్​లను ఆశ్రయించి వేలకు వేల రూపాయలు వదిలించుకోవాల్సి వస్తున్నది. మెషిన్లను రిపేర్​ చేయించాలని టీవీవీపీ, టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఉన్నతాధికారులకు తాము సమాచారం ఇస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆయా హాస్పిటళ్లలోని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, ఇతర నిధులను ఉపయోగించుకోవడానికి కూడా అనుమతివ్వడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు.

కరీంనగర్​లో 6 నెలలుగా మూలకు

కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌‌లో ఆరునెలలుగా సీటీ స్కానింగ్​ మెషీన్​ పనిచేయడం లేదు. రోజూ ఈ దవాఖానలో వెయ్యికిపైగా ఓపీ నమోదవుతుంటుంది. సీటీ స్కాన్ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేటు ల్యాబ్​లకు వెళ్తున్నారు. ప్రైవేటు డయాగ్నసిస్‌‌ సెంటర్లలో సీటీ స్కాన్‌‌కు రూ. 4వేల నుంచి 5 వేలు వసూలు చేస్తున్నారు. మెషిన్​ను రిపేర్‌‌‌‌ చేయించాలని తాము పదే పదే చెబుతున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కరీంనగర్​ సివిల్​ హాస్పిటల్​లోని ఓ ఆఫీసర్ తెలిపారు. ఇక్కడి పరిస్థితిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ (హెచ్చార్సీ) కూడా సీరియస్​ అయింది. ఆరునెలలుగా సీటీ స్కానింగ్​ మెషిన్​ పనిచేయకపోతే డాక్టర్లు, అధికారులు.. రోగులకు ఎలా సేవలు అందిస్తున్నారని మండిపడింది. మెషీన్ పనిచేయకపోతే అందుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్లకు శనివారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

నల్గొండలో ఉన్నా లేనట్టే!

నల్గొండ జిల్లా కేంద్రంలోని దవాఖానలో సీటీ స్కానింగ్ మెషీన్ ఉన్నప్పటికీ, దానికి అవసరమయ్యే ట్రాన్స్‌‌ఫార్మర్​ కెపాసిటీ తక్కువగా ఉంది. దీంతో రోజుకు గంట మాత్రమే ఇది పనిచేస్తోంది. నెల రోజుల నుంచి ఇక్కడి ఎక్స్‌‌రే మెషిన్​ రిపేర్‌‌‌‌లో ఉండగా, ఆల్ర్టాసౌండ్ మెషిన్​ ఉన్నప్పటికీ దాన్ని నడిపే టెక్నీషియన్ లేకపోవడంతో మూలకే పడి ఉంటోంది.

రిపేర్ కాస్ట్ అంచనా వేయడంలో జాప్యం

గతేడాది డిసెంబర్‌‌‌‌లో ఫేబర్ సింధూరి సంస్థ కాంట్రాక్ట్​ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన మెషీన్ల రిపేర్ల బాధ్యతలను తెలంగాణ స్టేట్‌‌ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌(టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ)కు అప్పగించింది. రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన యంత్రాలు రాష్ట్రంలో 940 ఉన్నాయి. వీటిలో చాలా వరకూ పాతవే కావడం, లోడ్‌‌ ఎక్కువగా ఉండడం, క్వాలిఫైడ్ టెక్నీషియన్లు లేకపోవడంతో పదే పదే రిపేర్లకు వస్తున్నాయి. రిపేర్ వచ్చిన వెంటనే ఆయా దవాఖాన్ల సూపరింటెండెంట్లు టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. టీఎస్​ఎంఎస్​ఐడీసీ అధికారులు రిపేర్‌‌‌‌కు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి, రిపేర్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీలో బయోమెడికల్ ఎక్విప్‌‌మెంట్ ఇంజనీర్లు లేరు. సివిల్ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించడంతో, మెషీన్ల రిపేర్‌‌‌‌కు అయ్యే ఖర్చు అంచనా వేయడంలో వాళ్లు వెనుకముందవుతున్నారు. దవాఖాన్ల సూపరింటెండెంట్లు వేసి ఇచ్చిన అంచనా వ్యయాన్ని అప్రూవ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇక్కడ అప్రూవల్ అనంతరం రిపేర్లకు కావాల్సిన డబ్బులను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌ (టీవీవీపీ) ఇవ్వాల్సి ఉంటుంది. రిపేర్ల కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని,  ఇతర నిధులను వినియోగించుకునేందుకు అనుమతివ్వడం లేదని టీవీవీపీ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో అవ్వాల్సిన రిపేర్లకు కూడా నెలల సమయం పడుతోంది.

టీవీవీపీలో ఖాళీగా బయోమెడికల్ ఇంజనీర్లు

ఓ వైపు టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీలో బయోమెడికల్ ఎక్విప్‌‌మెంట్ ఇంజనీర్లు లేక పనులు ఆగిపోతుంటే, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌(టీవీవీపీ)లో ఉన్న బయో మెడికల్ ఇంజనీర్లు ఖాళీగా ఉంటున్నారు. తనకు ఏ బాధ్యతలూ అప్పగించకపోవడంతో టీవీవీపీలో ఓ సీనియర్ ఇంజనీర్‌‌‌‌ రోజూ వచ్చి అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నారు. ఇలా మొత్తం నలుగురు సీనియర్ ఇంజనీర్లు ఉన్నారు. తమ సేవలను సరిగా వినియోగించుకోవడంలేదని వాళ్లు చెబుతున్నారు. వాస్తవానికి బయోమెడికల్ ఇంజనీర్లు, టెక్నీషియన్లను టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీకి షిఫ్ట్ చేసి మెషీన్ల రిపేర్లు, కొనుగోలులో వీళ్లకు బాధ్యతలు అప్పగించాలని ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పటికీ ఈ జీవో ఇంప్లిమెంట్ కాలేదు. మరోవైపు, చిన్న చిన్న యంత్రాల రిపేర్లకు రూ. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తున్నారు. రాష్ట్రంలో రూ. 5 లక్షల కంటే తక్కువ విలువైన యంత్రాలు 29 వేలు ఉన్నాయి.  ఫేబర్ సింధూరి కాంట్రాక్ట్ రద్దు తర్వాత వీటి రిపేర్ల బాధ్యతలను దవాఖాన్లకే వదిలేశారు. స్థానికంగా ఉండే ప్రైవేటు సంస్థలతో వీటి రిపేర్లు చేయిస్తున్నారు. బయోమెడికల్ ఇంజనీర్లు, టెక్నీషియన్లను వినియోగించుకుంటే ఈ డబ్బులు ఆదా అవుతాయని డాక్టర్లు
చెబుతున్నారు.

 మెషిన్ ఖరాబైందన్నరు

యాక్సిండెంట్​​లో గాయపడి దవాఖాన్ల నేను అడ్మిటయి మూడు రోజులైతున్నది. సీటీ స్కాన్, ఇంకా ఏవో పరీక్షల పేరుతో  ట్రీట్​మెంట్ స్టార్ట్ చేయలేదు. సీటీ స్కానింగ్​ మెషిన్​ ఖరాబైందని చెప్పి.. బయట చేయించుకొమ్మన్నరు.

– సురేశ్, ఇప్పలగడ్డ తండా, సంగారెడ్డి

బయటికి రాసిండ్రు

బండి మీద నుంచి కింద పడ్డ. నెత్తికి, పేయికి దెబ్బలు తాకినయ్. శనివారం సంగారెడ్డి పెద్దాస్పత్రికి వస్తే సీటీ స్కాన్ పరీక్షలకు బయటికి రాసిండ్రు. బయట ప్రైవేటులో పరీక్షలు చేపిస్తే రూ. 4 వేలు ఖర్చు అయినయ్​. మాలాంటి పేదోళ్లు పైసలు లేకనే సర్కారు దవాఖానకు వస్తరు.

– శ్రావణ్, కంది, సంగారెడ్డి

ప్రైవేట్ల చేయించుకున్నం

కొడుక్కు యాక్సిడెంటైతే కరీంనగర్​ సర్కార్​ దవాఖాన్ల చేరిండు. ప్రైవేట్ల చూపెట్టుకునే స్థోమత లేక ఈడికి వచ్చినం. ఈడ స్కానింగ్​మెషిన్​ పనిజేస్తలేదని చెప్పి బయటికి రాసిండ్రు. ప్రైవేటులో చేయించుకున్నం. రూ.4 వేలైనయ్.

– యాక్సిడెంట్​ బాధితుడు కృష్ణ తల్లి జయలక్ష్మి, చొక్కరావుపల్లి, కరీంనగర్​

10వేల దాకా ఖర్చయినయ్

మా ఆయినకు ప్రమాదం జరిగి కాలు, ముఖానికి దెబ్బలు తగిలినయ్. అక్కన్నపేటకెంచి ఇంత దూరం కరీంనగర్​ సర్కార్​ దవాఖానలకు వచ్చినం. అన్ని పరీక్షలు బయటకే రాస్తున్నరు. మొత్తం రూ. 10వేల దాకా ఖర్చయినయ్​.

– యాక్సిడెంట్​ బాధితుడు భూక్య గోర్కా భార్య రాజమ్మ, అక్కన్నపేట